Tuesday, May 31, 2011

Day 151 ~ May 31 - And the day begins

The daily reads in a basket... stored away immediately out of the daughter's reach lest you find it floating in water or in a ball :(

చిచ్కూ గాడి దాటికి తట్టుకోలేక నేను రోజు చదుకునే పేపరు, వీక్లీలు, మంత్లీలు.. ఇలా బుట్టలో పెట్టుకుని పైన దాచుకోవాల్సోస్తుంది.. 

Day 150 ~ May 30 - Another Angel Comes Home

Found this one angel really cute...

హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు బయట రోడ్ మీద ఇవి పెట్టుకుని ఒక అబ్బాయి వెళ్తుంటే ఎందుకో భలే నచ్చేసి తెచ్చేసి తగిలించేసా.. శబ్దం రాకుండా గాలికి తిరుగుతూ భలే ఉంది.

Day 149 ~ May 29 - Tolakari Vaana


Rains cant stop us from a walk...

ఈ ఏడాది పొడుగునా వానలే వానలు.. ఎండలు మండిపోతున్నాయి రోహిణి కార్తె భగ్గున సెగలు రేపుతోంది కాని ఒక్కోసారి ఈదురు గాలులు వానలు కూడా పడుతున్నాయ్.. ఋతుపవనాలు వచ్చేసాయి అంటున్నారు.. కాబట్టి ఇదే తొలకరి వాన అనుకోవాలేమో, పగలంతా మూగ ఎండ, తెల్లారిగట్ల వాన... చిచ్కూ మటుకు షికార్లు ఆపడం లేదు.. చెప్పులు గొడుగు ఆచ్చికి రెడీ. 

Day 148 ~ May 28 - Tiny feet and footwear

Too many options to pick from... the last rack is mine :).

చెప్పులు, బూట్లు ఆచ్చి కి వెళ్ళాలి అంటే రెండు నిమిషాలు అలోచించి ఒకటి తొడుక్కుని బయలుదేరడం... తనకి ఆ బుల్లి ఎర్ర చెప్పులంటే ఎక్కువ ఇష్టం, దాని మీద పోగొ అని రాసి ఉంటుంది.. అమ్మ పోగొ చెప్పులు బాగుంటాయ్ కదా అని రోజుకోసారి చెప్తుంది.

Friday, May 27, 2011

Day 147 ~ May 27 - Eeta Kaayalu

Yet another summer childhood memory... raw fruits.. need to ripen to eat them

ఎండాకాలంలో తాటి ముంజెలు తో పాటు ఈతకాయలు కూడా బోలెడు దొరుకుతాయ్... చక్కగా వీటిని తెచ్చుకుని గడ్డిలో పందేసుకుని కాయలు తినేసి, ఈత గింజలు తీసుకుని ఆటలు ఆడుకునే వాళ్ళం.. వామన గుంటల్లోకి, అచ్చంగాయల్లోకి, చింతపిక్కలాటలోకి వీటిని వాడేసేవాళ్ళం.. కాయలు పిల్లలు తెచ్చారు పండేసి పండాక కుమ్మేసి ఆ ఫోటోలో కూడా పెడతానోచ్ 

Wednesday, May 25, 2011

Day 146 ~ May 26 - Old World Charm

the old world coins...

నిన్న ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకో ఈ చిల్లి కానీలు కనిపించే.. చక్కగా అన్ని కానీలు పోగు చేసి దారం కట్టి దాచి ఉంచారు ఆవిడ.. ఎప్పటెప్పటి నాణాలు అన్ని ఒక చిన్న ముంతలో దాచి ఉంచారు.  ఆ చిన్ని ముంత చూడటానికి తాటాకులతోనో, ఈతాకులతోనో చేసినట్టుగా అనిపించింది.. కాని అవి అంత గట్టిగా ఉండవు, కొన్నాళ్ళకి పెళుసుగా అయిపోతాయి.. తనకి కూడా దేనితోటి చేసారు అని తెలియదు అంట, ఆఖరికి ఖర్జూరాకుతోటి చేసి ఉంటారు అని తీర్మానించుకున్నాం.. ఎవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకుందురు ప్లీజ్.


Love this little basket.

ఎంతైనా వెనకటి పనితనం ఇప్పుడు కనిపించదు ఎలాంటి వస్తువులోనైన 

Tuesday, May 24, 2011

Day 145 ~ May 25 - Neredipallu

love the taste..

అమ్మమ్మ వాళ్ళ దొడ్లో ఒక చెట్టు ఉంది కాని దానితో వచ్చిన బాధ ఏంటి అంటే మనం పళ్ళు కొట్టుకుంటే కింద పదేపాటికి చితికిపోయి నేల మీద ఉన్న మట్టి అంటుకుంటుంది, కడిగినా ఎక్కడో ఒక మూల కస కసలాడుతూనే ఉంటుంది.. కింద పట్టా పరిచి వాసం కర్ర తెచ్చి అవి కొట్టి మల్లి ఏరి కడిగే ఓపిక నాకు లేదు కాబట్టి వాటినే ఎలాగో కడిగి పిక్క మీద మిగిలిన కండని కాస్త చప్పరిస్తాను.. ఊర్లో షుగర్ ఉన్న అమ్మమ్మలు ఆ గింజలు కడిగి, ఎండబెట్టి ఏదో చేసుకుని వంటింటి వైద్యం చేసుకుంటారు కాబట్టి దొడ్లో చెట్టు కాయలు దానికే ఎక్కువ వాడుతున్నాం ఈ మధ్య.  మొన్న రోడ్ మీద వెళ్తుంటే కనిపించేసి, అమ్మో అమ్మో అనుకుంటూ కొనుక్కుని తినేసా.. నాలిక రంగు మారి వేవ్వేవ్వే అని ఎక్కిరించుకోడం మరకలు పడిపోతే జాగ్రత్త, సుబ్బరంగా కడుక్కోండి ఆ మట్టితో పాటు నాకేయ్యకండి అని అమ్మమ్మ కేకలు బుర్రలో backgroundలో వినిపిస్తూనే ఉన్నాయ్.  


Monday, May 23, 2011

Day 144 ~ May 24 - Geetaanandam.

An evening listening to Geeta discourse by Swami Paripoornananda

భగవద్గీత అంటే నాకు చాలా చాలా ఇష్టం, వింటూ ఉంటె మనసుకు అదొక రకమైన ప్రసాంతత, నిన్న ఊర్లో మామ్మలందరూ వెళ్ళబోతూ నాకు కూడా కబురు పెడితే వెళ్లి వచ్చాను.  మొదట్లో స్వామి వారి PRO అని అది అని హంగామా చాలా చిరాకేసి ఎందుకొచ్చాను రా బాబు అనిపించింది కాని ఈయన మాట్లాడటం మొదలు పెట్టిన తరవాత అంతా మర్చిపోయి విన్నాను.  నేను అతి పూజలు చెయ్యను, స్వామిజీలని నమ్మను, చాందసం నచ్చదు.. ఇది వారం రోజులు చేస్తారు నేను వారం వెళ్తాను అని కూడా చెప్పలేను కాని నిన్న విన్నది బాగుంది. 

Sunday, May 22, 2011

Day 143 ~ May 23 - Covered :)

Do you spot the difference between the 3 piles??

పుస్తకాలు కొనడం చదవటం ఒక ఎత్తు ఐతే, వాటిని భద్రం చెయ్యడం ఇంకొక ఎత్తు, బైండింగ్ చేయిస్తే పుస్తకాలు బరువు పెరుగుతాయ్, మళ్ళీ అవేంటో కూడా సరిగ్గా అర్థం అయ్యి చావవు, కొంతకాలానికి పురుగు కూడా పట్టేస్తుంది తీయకపోతే.. సో చించి చించి ఈ ప్లాస్టిక్ కవేర్స్ వేసేశాను :).. తరవాత సంగతి తరవాత ప్రస్తుతానికి గడిచిపోతుంది.. ఆ షీట్ కొనడానికి, తెచ్చి అట్టలేయ్యడానికి నేను పాట్లు అయ్యో అయ్యో, ప్రతి సారి కొనడం కొన్నాక బస్లో మర్చిపోయి రావడం మూడు సార్లు జరిగాక చివరాఖరికి మొండిగా ఒల్లో పెట్టుకుని తెచ్చేసుకున్నా.. ఎలాగో చిచ్కూ గాడిని మాయ చేసి వాడి ముందే వేసేశాను.. హమ్మయ్య.. :).. ఇంకా నాలుగైదు గుట్టలు ఉన్నాయ్, తీరిక చూసుకుని చేసేస్తే ఇంకా కొన్నేళ్ళు మర్చిపోవచ్చు :).


Saturday, May 21, 2011

Day 142 ~ May 22 - Mallepoola Vaana...

The scent of jasmine is one of the things that makes the otherwise hot hot hot summer tolerable... love the arrangement in the stall.

ఎండాకాలంలో మల్లెల చల్లదనం, వాసన, తెల్లదనం చాలా హాయిగా అనిపిస్తుంది... ఇలా బుల్లి కొట్లలో మూతలు వేలాడ దీసి వాటి మీద తడి గుడ్డ కప్పి, మరువం, లేదంటే మాసుపత్రి వేసి ఆ పైన పూలు చుట్లు తిప్పి అప్పుడప్పుడు తడుపుతూ అమ్ముతూ ఉంటారు.. పది రూపాయలకి రెండు మూరలు.. పండగొస్తే కాస్తెక్కువ, కారులో వస్తే మూర పది, మూర కొలతల దెగ్గర చిన్న చిన్న గొడవలు, బేరాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ కొంటారు.. ఇంటికొస్తూ మల్లెపూలు కొనుక్కొచ్చే భర్తలు, తండ్రులు, కాలేజీ నించి కొనుక్కుని వెళ్ళే పిల్లలు, పూలు పూలు అని పక్క కొట్లలో కేకలు... ఆహ!!

Friday, May 20, 2011

Day 141 ~ May 21 - Rickshaw Puller

my savaari in Gdw, whenever I go there..

గూడు రిక్షాలు పోయి ఈ రిక్షాలు వచ్చేసి ఈ మధ్య, ఎక్కడం కాస్త కష్టం నాకు బట్ కాలుష్యం పెంచని బండి కాబట్టి నాకు ఇదే ఎక్కువ ఇష్టం అంతక ముందు అరె ఒక మనిషి కష్టపడి బండి లాగుతుంటే దున్నపోతులాగా ఎక్కి కూర్చోడం ఏంటి అని ఒక ఫీలింగ్ ఉండేది, తరవాత తరవాత వాళ్ళతో మాట్లాడి, తెలుసుకుంది ఏంటి అంటే ఆటోలు లాంటివి కొంటె పెట్రోలు అని, license అని, పోలీసులు అని, రిపేర్లు అని ఆ గోలంతటికంటే రెక్కల కష్టం మంచిది అని అనుకుంటున్నారు అని నచ్చితే వెళ్తాం లేదంటే తన్ని పెట్టి పడుకుంటాం అని అనుకుంటారు అని.. ఈ బండి లాగి పిల్లల పెళ్లి చేసి, చదువులు చెప్పించి చాల చేసాం అంటే భలే ముచ్చటేస్తుంది.. ఎప్పుడు గుడివాడ ఎల్లినా చక్కగా నేను వెళ్ళాల్సిన చోట్లు , ఉండాల్సిన టైం చెప్పేసి ఒకళ్ళని మాట్లాడేసుకుని మళ్ళి బస్సు స్టాండ్ దెగ్గర దిమ్పేసే లాగ చూసుకుంటున్న.  ఈ మధ్య నేను వాళ్లకి బాగా పరిచయం అయిపోయి వాళ్ళే వంతులేసుకుని వచ్చేస్తున్నారు :).  

మనుషులతో మాట్లాడుతూ, సుఖ దుఖాలు తెలుసుకుంటూ, కలిసి ఉండటంలో ఉన్న మజా నే వేరు కదా.   

Thursday, May 19, 2011

Day 140 ~ May 20 - Daalava Gaddi

The ox-cart full of hay... the kid trying to get on to the hay pile on the cart in the inset :).

పంట చేతికొచ్చినాక, ఊర్లో పని ఆగిపోదు, ఇంకా రకం మొదలవుతుంది, సారవా గడ్డి ఐతే పశువుల మేతకి తీసుకొచ్చి వాము కట్టి సంవత్సరం మొత్తానికి వాడుకుంటారు, పొలాల్లో పచ్చగడ్డి తో పాటు ఈ ఎందు గడ్డి కూడా పెడతారు వాటికి.  ఈ మధ్య మిషను కోతలు మొదలయ్యాక గడ్డికి విపరీతమైన గిరాకీ, చేత్తో కోస్తేనే గడ్డి ఇంత పొడుగ్గా ఉంటుంది, మిషను కోటకి చిన్న చిన్న తుంపులు ఐపోయి ఎందుకు పనికి రాదు.  దాల్వ గడ్డి అంట సారవంతంగా ఉండదు కాబట్టి అది ఇళ్ళ మీద కప్పడానికి వాటికి వాడతారు.  ఇది దాళవ కాబట్టి ఇప్పుడు వచ్చే గడ్డి అంట నాణ్యంగా ఉండదు అంటారు.. కాని మొన్న వాన దేవుడి దెబ్బకి మిషను కోతలు కోసి సరిగ్గా గడ్డి లేక ఈ గడ్డినే పెట్టేస్తున్నారు. 

The hay ready to be stacked for cattle food and palm leaves for roof tops.

పొలం గట్ల మీద ఉండే తాతకు చెట్ల ఆకుల్ని కొట్టేసి ఎండా బెట్టి అవి కూడా ఎండాకాలంలో వానలు రాకముందు ఇల్లు కుట్టడానికి, పూరి పాకలు ఐతే, లేదంటే బాగు చేసి దడులు కట్టుకోవడానికి వాడతారు, ఈ మధ్య గడ్డి  కష్టాలకి, కుట్టడానికి మనిషి దొరకక, చాకిరి చెయ్యలేక, ఇందిరమ్మ రుణాలు, డ్వాక్ర లోన్లు తీసేసుకుని రేకుల ఇల్లు కట్టేసుకుంటున్నారు.. తాటాకుల ఇల్లు వాటిల్లో చల్లదనం ఇప్పుడోు ఎక్కడో తప్ప కనిపించట్లేదు.  ఇంకా ఒకరో ఇద్దరో మొత్తం ఊరంతటి మీద ఒక పాతిక ఇళ్లు ఉంటాయేమో.. ప్రతి ఏడు ఎండలు ఐపోయే సమయానికి ఇంటి ముందు ఈ రెండు కుప్పలు ఉండేవి తను ఉండగా.. ఇప్పుడు ఎప్పుడో తప్ప కప్పరు.  వచ్చే నాటికి ఆ ఇళ్లు కూడా ఉండవేమో :(..

Wednesday, May 18, 2011

Day 139 - May 19 - New To Mommydom :)

A new mom scared like hell with a new life to be taken care of, all by myself, 24x7, looking back it was a pretty decent job that I did back then!!

ఏదో పుస్తకాలు సర్దుతుంటే చిచ్కూ డైలీ లాగ్ బుక్ కనపడింది.. రెండేళ్ళ క్రితం ఒక పసి ప్రాణం, దాని గురించి ఏమి తెలియని ఒక తల్లి, ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పెంచేసా ఏరోజుకారోజు ఈ రోజు గడిస్తే చాలు అనేటట్లు ఉండేవి నా పాట్లు.. అందరు ఒక ఏడాది వస్తే అంతా సర్దుకుంటుంది అనేవారు.. కాని అప్పుడే ప్రాణానికి భలే హాయిగా ఉండేది పట్టినన్ని పాలు తాగి, ఏదో కొంచెం కక్కేసి మొత్తం మీద రోజులో 18 నుంచి 20 గంటలు పడుకుని కదలకుండా మెదలకుండా అస్సలు నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు.. ఇప్పుడు తిండి పాట్లు తలచుకుంటే ఆహా అదే స్వర్గం కదా అనిపిస్తుంది.. ఇలా అన్ని పుస్తకంలో రాసుకుంటూ, కదిలిన, మెదిలిన కెమెరాలో బందిన్చుకుంటూ, ఎంతో అపురూపంగా పెంచుకున్న నా బంగారు తల్లి చెంగు చెంగున గంతులేస్తూ తిరుగుతుంటే ఆరోజు ఎంత మంది ఎక్కిరించినా లైట్ లైట్ లైట్ అనిపిస్తుంది, తోచినట్లే వచ్చినట్లే పెంచుకున్న ఎవరి మీద ఆధారపడి బరువు అవ్వలేదు అని ఒక పిసరు గర్వంగా కూడా ఉంటుంది.... పని వాళ్ళు ఎందరున్నా నా వాళ్ళు లేరు అని ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆ పైవాడే నా వాడు అనేదే నా ధీమా నాడు, నేడు, ఎప్పుడు కూడా.

ఒకటి నేను నేర్చుకుంది బిడ్డ పెంపకంలో అందరివి విను, నీకు మంచిది అనిపించిందే, బిడ్డకి క్షేమం అయ్యిందే చెయ్యి.. చేతిలో బిడ్డని చూస్తె ప్రతి ఒక్కరు సలహాలిచ్చే వాళ్ళే.. కన్నావులే మా లావు బిడ్డని అంటే, అవునండి నా పాట్లు నాకే తెలుసు అని ఒక చింపిరి నవ్వు నవ్వడమే :).

Day 138 ~ May 18 - Vaalujada, poolajada :)

One more of the summer treat.. the braid decorated with jasmine, a must for almost every girl in the village.

ఎండాకాలం అంటే ముంజెలు, మామిడికాయలు, మాల్లెపూలు.. వీటన్నిటితో పాటు పూల జడలు వేయించుకుని చెంగు చెంగున తిరిగే పడుచు పిల్లలు, ఆడపిల్లలు.  బారెడు జడిలో మూరెడు తక్కువ కాకుండా పెట్టుకునే ఆడపిల్లలు ఎండాకాలం వస్తే చాలు ఒక కిలో మల్లెపూలు, జడ కుప్పెలు, మరువం, కనకాంబరాలు అన్ని కలిపి జడలేయ్యటం వచ్చిన మామ్మల దెగ్గర చేరిపోతారు.. ఇవి కొట్లో కొనుక్కొచ్చి తగిలించుకునే సవరాలు, జడలు కాదు... ఓపికగా గంటలు గంటలు కూర్చుని అల్లించుకున్న జడలు.. మధ్యానం అన్నం తిని అల్లిన్చుకోటం మొదలు పెడితే సాయంత్రానికి తయారయ్యి స్టూడియో కి వెళ్లి అద్దాల ముందు దిగి ఫోటోలు తీయించుకోవడం.. అవి ఫ్రేము కట్టించుకుని గోడకి వేలాడెయ్యటం ఆడపిల్లలు ఉన్న అందరి ఇళ్ళలో జరిగేదే.    

love the arrangement here.

చిన్ని పాయలు తీసి జడలు వేసి కింద మళ్ళీ జడ అల్లడం చాల బాగుంది.


ఈ జడ వేయించుకుని ఆ రాత్రి జాగారం చేస్తే మంచి మొగుడు వస్తాడు అని ఈ పల్లెటూరి ఆడ పిల్లల నమ్మకం.

నేను పెళ్లి అప్పుడు ఒక్కసారి మాత్రం వేయించుకున్నాను, దానికే అష్ట కష్టాలు...

PS:  None of the pics is me...

Monday, May 16, 2011

Day 137 ~ May 17 - Maggi Days

Now that I am cooking, this would be more often in the menu :).

నాకు maggi తినడం అంటే చాల ఇష్టం.. అంటే అది పొట్లం పళంగా వాళ్ళు చెప్పినట్టు ఉడకేసుకుని తినేస్తే కాదు.. సుబ్బరంగా మన ఉప్మా టైపులో వండుకుని అన్ని ఏసుకుని తింటే ఇష్టం.. అందులోకి చిల్లి సాస్ కొంచెం వేసుకుని టొమాటో సాస్ నంజుకుని తింటే యమా యమా ఇష్టం.   నేను maggi చేస్తే మా వాళ్లకి కూడా భలే ఇష్టం, రోజూ ఇడ్లి, ఉప్మా, అట్టు తిని తిని విసుగేసినప్పుడు అప్పుడప్పుడు చేస్తే భలేగా ఉంటుంది..

Day 136 ~ May 16 - Naagendra Swamy

I knew there was a temple in the fields in village but never been to it.. Valli, Devesena Sameta Nagendraswamy temple :).

నాగేంద్ర స్వామికి వల్లి దేవసేన అని ఇద్దరు భార్యలు ఉంటారు అని వారి సమేతంగా వెలిసిన గుడి అని ప్రతి ఏడు ఇక్కడ సంబరాలు చేసి కల్యాణం చేస్తారు, రేపు కల్యాణం ఇవ్వాళ డాన్సు బేబీ డాన్సు ఉంది అందులో ఊర్లో పిల్లలు అందరు డాన్సులు చేస్తున్నారు, యాసి భయ్యా కూడా చేస్తున్నాడు అని తెలిసి చిచ్కూ కోసం రాత్రి వెళ్లాం కాని ఇంకా మొదలవ్వలేదు.., పొలాల్లో పెట్టారు కాబట్టి లైటింగ్ కి ఒకటే పురుగులు, గాలి చల్లగానే ఉంది కాని కుర్చీలు అవీ ఏమి లేవు పోనీ అలాగే నెల మీద కూర్చుంది చూద్దామా అంటే పక్కన పొలాలు అప్పుడే కోతలు జరుగుతున్నాయ్ పురుగు పుట్రా ఉంటుందేమో అని భయం.. కాసేపు అటు ఇటు ఆడించి తీసుకోచ్చేసాం.  మొత్తం మీద చిచ్కూగాడి పుణ్యమా అని పుట్టి బుద్ధెరిగాక ఎల్లని ఊరి చివరికి వెళ్లి దేవుడిని చూసి వచ్చా :).

Day 135 ~ May 15 - The Golden Oldies' Sacred Chants

A group of golden oldies reciting Vishna Sahasranamaalu, Lalita Trisati, Sundarakanda, Hanuman Chalisa, etc. every day for 40 days.

మా ఊర్లో తెల్లారి లేచినప్పటినించి రాత్రి నిద్రపోయీదాక ఏదోక రకంగా భగవన్నామ స్మరణ వినపడుతూనే ఉంటుంది.. గుడిలోనుంచో , మసీదులోంచో, చర్చిలోంచో ఎప్పుడు ఏదో ఒక మైకు లోంచి వినపడుతూనే ఉంటుంది.. అన్ని ఉత్సవాలు, సంబరాలు చేస్తూనే ఉంటారు... నలభై రోజులు పారాయణం చేస్తున్నాం నువ్వు కూడా కుదిరితే రమ్మని కబురు పంపితే  నేను చిచ్కూ కూడా కొన్ని రోజులు టంచనుగా ఆరు గంటలకల్లా గుళ్ళో ప్రత్యక్షం అయిపోయాం, అంతా ఐపోయాక జైకొట్టి Satagopam (బ్లాగర్ తెలుగులోకి సరిగా మార్చట్లేదు :)  పెట్టించుకుని, తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని, కానుకలు వడ్డించుకుని ఆచ్చికి వెళ్ళిరావడం అంటే సాయంత్రం నాలుగింటి నించే గోల గోల అమ్మమ్మోలోచ్చేత్తారు.. తొందర అమ్మ అని ఊపిర ఆడనివ్వలేదు.    ఈ మధ్య ఎండలకి కళ్ళు తిరిగుతున్నట్టు అనిపిస్తుంది నాకే అందుకే ఒక వారం డింకీ కొట్టి మళ్ళీ నిన్నే వెళ్ళాం... రేపు శుక్రవారానికి సమాప్తం అయిపోతుంది.

Day 134 ~ May 14 - sandatlo sademiya

When the mom gets busy, the kid gets busier...

వంట, ఇల్లు, వగైరా వగైరా అన్ని చూసుకుంటూ నేను అటు ఇటు తిరుగుతుంటే పండు గాడు ఇంకా బిజీగా దిళ్ళు, దుప్పట్లు, పరుపులు లాగి పారేసి కాగితాలు సద్దేస్తున్నాడు ఈ మధ్య.  ఎంత వద్దు అని చెప్పినా సరే పరుపుల కింద కాయితాలు, ప్లాస్టిక్ covers చెత్త చెదారం పెట్టడం మా అమ్మ మానదు, అవి తీసి పారెయ్యడానికి పండుగాడు ఇవన్ని లాగాకా మానదు... 

Day 133 ~ May 13 - Godhooli Vela

I realized I did not take a picture for the day and clicked this at the very end of the herd..

గోధూళి వేళ అని సాయంత్రం సమయాన్ని అంటారు ఎందుకో తెలిసేది కాదు అంతకు ముందు, ఇప్పుడు సాయంత్రం అయ్యేపాటికి రోజంతా ఊరు చివర గడ్డిలో, పొలాల్లో ఒక్కడో మేత మేసేసి సాయంత్రం అయ్యేపాటికి దుమ్ము లేపుకుంటూ ఇళ్ళకి పరుగులు తియ్యడం అని ఇప్పుడు అర్థం అయ్యింది.. రోజు సాయంత్రం చీకటి పడే వేళకి అవి ఇళ్ళకి రావడం మేము గేటు దెగ్గర నుంచుని అందరిని పలకరించడం ఒక అలవాటు.

Wednesday, May 11, 2011

Day 132 ~ May 12 - Baddakistski Pani Ekkuva :(


Instant Biryani.. we had to have for dinner.

పిసినారికి ఖర్చు ఎక్కువ బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా అమ్మమ్మ చిలక్కి చెప్పినట్టు చెప్పేది చిన్నప్పటినించి... అయినా మన బుర్రకి అవన్నీ ఎక్కేస్తే మనం ఎందుకు ఇలా ఏడుస్తాం.. ఇప్పుడు కాదు అప్పుడు అని చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా బియ్యం అయిపోవస్తున్న సరే ఇదిగో ఫోన్ చేస్తే తెచ్చేస్తాడు అనుకుంటూ ఆలస్యం చేసినందుకు నేను ఆఖరి గింజ కూడా అయ్యాక ఫోన్ చేస్తే కొట్టు తెరవలేదు అంట నిన్న... ఏమి చేస్తాం అమెరికా తెలుగు వాళ్ళు సోన మసూరి కొనలేక బిర్యాని బియ్యం తినేసి సర్డుకుపోతున్నట్లు నిన్నటికి అవే వండుకుని లాగించేసాం... మూడు గుడ్లు కూడా ఉడకేసుకుని.. అందుకే అంటారు గోటితోటి పోయేదానికి గొడ్డలి దాక తెచ్చుకోకూడదు అని.  

Day 131 ~ May 11 - Leta Kobbari

Tender coconut malai :).. kobbari meegada that we call it... yum!!!

ఎండాకాలం ఊర్లో ఉన్నామా అంటే బొండాలు దిమ్పించి తాగటం అనేది తప్పని సరి కార్యక్రమంగా ఉండేది చిన్నప్పుడు.. ఇంచు మించు అందరి దొడ్లో ఉంటాయి ఈ చెట్లు.. కొబ్బరి కట్టడం మొదలు ఐతే నీరు తియ్యబడుతుంది నీరు కొబ్బరి రెండు చాల రుచిగా ఉంటాయి.  చాలా చాలా రోజుల తరవాత ఈ కొబ్బరి మీగడ జుర్రేసాము నేను  చిచ్కూ నిన్న.. 

Monday, May 9, 2011

Day 130 ~ May 10 - Blossoms

Good to see these tiny blossoms...

చిన్ని చిన్ని పూలు తొందరగా వాడిపోవు మళ్ళీ కొన్నాళ్ళకి పువ్వు మధ్యలోనే మళ్ళీ చిగురు.. ఎండాకాలంలో బ్రతకవు బ్రతకవు అని ఎంత మంది చెప్పినా మొండిగా తెచ్చి పెంచుతున్న నాకు ఈ మొక్కలని చూస్తె భలే సంతోషం.. మనసుకు నచ్చిందే చెయ్యాలి, అలా మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది మళ్ళీ చాటి చెప్పినట్టు ఉంటుంది.

Day 129 ~ May 9 - Parcel

Registered parcel or speed post... good to receive mail..

ఇక్కడ ఊర్లో ఇంగ్లీష్ పుస్తకాలు దొరకక తెప్పించుకుంటాను అప్పుడప్పుడు.. ఎప్పుడు కొన్న పుస్తకం మళ్ళీ మళ్ళీ నాకోసం మటుకు కొనుక్కోలేదు నేను.. కాని నేను చదువుకుంటూ ఆటో లో ఒక పుస్తకం వదిలేసా :(.. కాబట్టి మళ్ళీ తెప్పించుకుని మరీ చదువుతున్నా

Day 128 ~ May 8 - Crotons

A tree with carrot-colored tiny fruits that caught my attention in SP office, Machilipatnam...

జిల్లా head quarters  బందరు కాబట్టి ఇక్కడ ఎలాంటి పని జరగాలన్న బందరు పరుగెత్తాలి.. passport ఆఫీసు కూడా SP ఆఫీసులోనే ఉంటుంది కాబట్టి మరీ రద్దీగా ఉంటుంది.. ఏదో పని మీద వెళ్లి రోజంతా అక్కడే ఇరుక్కుపోయి పని లేని పనులు చెయ్యటం అంటే ఇదే మరి.. ఈ చెట్టు మీద ఒక బుల్లి కాయల గెల ఉంటె అక్కడ ఉడుత వచ్చి రాల్చుకుంటూ తింటూ ఉంది.. నేను అటు వెళ్లి కామెర పట్టుకోగానే ఫుర్ర్ర్ర్.. మళ్ళీ రాటం నన్నుచూసి  పారిపోటం ఇది మా ఆట.

Friday, May 6, 2011

Day 127 ~ May 7 - Kanakaambara Maala

Dont know the reason but these are called firecracker flowers..I love the color though..

కనకాంబరం పూలు అంటే నా చిన్నతనం జ్ఞాపకం వస్తుంది.. దొడ్లో నారు పోసి, ఎప్పుడూ ఉండే పూలు ఇవి, విడిగా మాల కట్టినా, కలగలిపి మాల కట్టినా చాల బాగుంటుంది.. మరుమం, కనకాంబరం, మల్లె పూలు కలిపి కడితే చూడటానికి చాల బాగుంటుంది.. వాసన లేదు అనే కాని  చూడటానికి మటుకు అదుర్స్. 

నాకు మాల కట్టడం రాదు.. కాలి మాల చేతి మాల అని రకరకాలుగా వత్తుగా మాల కడితే ఆ పూల అందం ఎంత పెరిగిపోతుందో.. ఆకులి పెట్టి అల్లడం నేర్చుకుందాం అనుకున్న ఏంటో దూరం దూరం అయిపోతుంది కాని సరిగ్గా ముద్దగా మాల మటుకు రాదు. చిచ్కూ పెరిగేలోపు నేర్చుకోవాల్సిన వాటిల్లో ఇది కూడా ఒకటి :).

ఈ రోజుకి తాత పోయి ౩ ఏళ్ళు... ఆ వెలితి పూడదు కాని అలవాటు ఐపోయింది.

Day 126 ~ May 6 - Buddodi Pelli

Watched the wedding of Jr. and Pranathi..

చిచ్కూ నేను కలిసి చూసిన రెండో పెళ్లి బుడ్దోడిది.. నాకు jr . అంటే చాల ఇష్టం, ఏంటో కష్టపడి పైకి వచ్చి, అందరినీ కలుపుకుంటూ తన తల్లికి ఒక మంచి స్థాయిని కల్పిస్తూ ఎప్పుడు నవ్వుతూ, చాల ఇంటెన్స్ గా కనపడుతూ ఉండే అతను అంటే నాకు భలే ముచ్చటేస్తుంది.. చాల సేపు టీవిలో పాటలు వింటూ డాన్సు చేసుకుంటూ ఎప్పుడో పదకొండు ఇంటికి పడుకుంది.  నేను పొద్దున్నే లేచి ముహూర్తం వేళకి చూసి దీవిన్చేసా..

పాపం చాల హైరానా పడిపోతూ కుదురుగా లేకుండా పెళ్లి చేసుకున్నాడు... కాని ప్రతిదీ ఎంతో ఇష్టపడి చేస్తున్నట్టు మాత్రం అనిపించింది..

ఇద్దరు కలకాలం చల్లగా ఉండాలి అని మీరు కూడా దీవించెయ్యండి మరి.

Thursday, May 5, 2011

Day 125 ~ May 5 - Navadhaanya Ganesha

I am a big fan of Ganesha, the lord who fits into any shape, basically the fun god.. a beauty to look at.. draw a few lines and there is there for you.. tadaan!!!   I used to have a huge collection of them in all shapes and sizes.. could not resist getting this one, a plastic mould filled sealed with Nava Dhaanyaalu when I saw him in window shopping spree.

బుల్లిగా ఎలాంటి ఆకారంలో ఐన అందంగా ఇమిడిపోయే బుజ్జి గణపయ్య అంటే నాకు భలే భలే ఇష్టం.. ఎంత సేపు అయినా చూస్తూ కూర్చోగాలను వెయ్యాలని కూడా ఉంటుంది గీతాలు గీసి ఇప్పటి దాక వెయ్యలేదు కాని..


Isnt this cute?

Day 124 ~ May 4 - New Friends

The kid finds new friends in 8 and 9 year old akkas in the neighborhood, looks on as they arrange the toys, play games, crack jokes, sing songs and bursts up into peels of laughter when they do just because she wants to be a part of the group and not be left alone when they are obviously having fun.. it is fun watching them play :).

శ్రేయ గాడి కొత్త స్నేహితులు.. సెలవలకి ఊరొచ్చిన పిల్లలు కొత్త అక్కలు .. ఏ పని చెప్పినా గబాల్న చేసేసి అక్క పోదామా అని తయారయ్యి కూర్చుంటుంది ఈ మధ్య.. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడతారు.. కాన్వెంట్ పిల్లలు కదా.. మనోడికి ఆ భాష రాదు. నేను నేర్పించాను కదా, ఎలాగోలా కష్టపడి ఇష్టపడి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని ఆటలు ఆడుకుంటున్నారు... అ బొమ్మలన్నీ పేర్చడం తరవాత ఎవరో ఒకరు వెళ్లి వాటిని పారెయ్యడం కప్పు లేచిపోఎలాగా అందరు నవ్వుకుని మళ్ళీ సర్డుకోడం.. గంటలు గంటలు చేసే పనులు.. 

Day 123 ~ May 3 - Modern Rangavalli

I love rangoli or muggu but I dont usually put one with traditional rice flour, biyyampindi or raati muggu.. I mean to do it but end up being lazy.

ముగ్గులు అంటే పది చచ్చిపోయే నాకు ముగ్గు వెయ్యడం ఈ మధ్య ఎక్కువగా కుదరట్లేదు.. పైగా నాకు పెద్ద ముగ్గులు వెయ్యడం కూడా రాదు.. ఏదో ఆకులు లతలు అంటే వేస్తా, లేదంటే చిన్న మెలికల ముగ్గులు వేస్తా కాని.. చుక్కలు పెట్టి ఆకారాలు వెయ్యడం మన వాళ్ళ కాని పని.. ఎవరైనా వేసి రంగులేయ్యమంటే మటుకు ముందు ఉంటా.. paint కూడా దిద్దిపెదతా కావాలంటే..

పెద్ద పెద్ద మెలికల ముగ్గులు అంటే, అవి కాయితం మీద చూడకుండా వేసే వాళ్ళు అంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది.. తప్పు పోకుండా చుక్క తుదవకుండా అలా ముగ్గు జారిపోయి అందంగా తయారు అవుతుంది... వెయ్యలేని నా లాంటి వాళ్ళకోసం ఈ అతికించుకునే ముగ్గులు కూడా బాగానే ఉన్నాయి.

An alternative for people like me are these beautiful tiny stick-ons for the floor.. these in no way match the beauty of the ones drawn by hand but is a pleasure to look at for the lazy ones like me.  The melikala muggulu are the ones that I like very much for their complexity, symmetry, look and everything :).

Day 122 ~ May 2 - Slurrrppp... mangoes

Being in coastal AP is a treat for the mango lovers in summer...

Pedda Rasaalu and Banginapalli.. slurrrrppppp..... reminded of my childhood when we used to get them in loads and ripen them in hay and have them with rice and buttermilk and also afternoon midmeal snack.

వానలకి కాయలు డాగులు పడిపోయి బాగా తక్కువ ధరకి అమ్మేస్తున్నారు.. డజను వంద రూపాయలే.. రుచి కూడా పర్లేదు.. కాయలకి ఇంటి నిండా ఈగలు.. అంతకు ముందు ఏ బాదరబందీ లేకుండా తినేసి కూర్చునేవాళ్ళం ఇప్పుడు తిన్నాక ఈగలు రాకుండా తుడిచి కడిగి అబ్బో దానికంటే తినకుండా ఉండటం మేలు అనిపించేస్తుంది :(.   ఐన మామిడి కాయ మామిడికాయే.. 

బంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది.. చిలుక కొట్టిన జాంపండు సిగ్గుపడింది.. అది నాకోసమే పండిందిలే.. అని లోట్టలేసుకుని ఆవురు ఆవురు అని కుమ్మేయ్యడమే :).

I love the taste.. yum, yum, yum.. but now I also realize the houseflies menace after savoring this :).

Day 121 ~ May 1 - New Planters

My new unusual planters, the pickle jars :).

కాదేది మొక్కకి అనర్హం అని వాడకుండా వదిలేసిన ఎన్నో ఇలాంటి వాటిల్లో మొక్కలు యుద్ధ ప్రాతిపదికన పెంచేస్తున్నాం.. చూడటానికి పచ్చగా, ముద్దుగా ఉంటూ బోలెడంత కాలక్షేపం అయిపోతుంది.  ఒక పచ్చటి బృందావనం తాయారు అవుతుంది :).

So, gardening is my full-time passion these days.. trying to create a green patch in summer... working on something both me and the kid love to do.