A snapshot of library checkouts in 2009...books my best friends, that see me through everything!!!
ఊరికొచ్చిన కొత్తలో టీవీ చూడలేక, మనసు అస్సలేం బాగోక, ఎవరి తోనూ మాట్లాడటం ఇష్టం లేక అంటే ఇష్టం లేక కాదు ఆ మాటలు వినలేక ఏమి చెయ్యాలో అర్థం కాక, ఎక్కడికైనా పారిపోదామా అంటే, పెద్ద పొట్ట వేసుకుని వెళ్ళలేక నా పాట్లు ఇప్పుడు తలచుకుంటే భలే నవ్వొస్తుంది. ఎలాగో అంత మొండితనం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఎందుకు అంత బాధ పడాలి అని... కాని అంత స్థితప్రజ్ఞత వచ్చేస్తే ఇంకేమి కావాలి.
శిరీష ఐడియా ప్రకారం నేను ఇప్పటి దాక చదివిన పుస్తకాల లిస్టు తయారు చెయ్యాలి అంటే చాల వరుకు గుర్తు రాట్లేదు, తోచినవి రాసుకుని, ఇలా లైబ్రరీ లో చదివిన వాటిని మాత్రం అక్కడికెళ్ళి రాసుకోచ్చాను. మొదట్లో నేనే వెళ్లి తెచ్చుకున్నాను, ఒకసారి కళ్ళు తిరిగి తూలు వచ్చెయ్యడం తోటి బడిలో పిల్లలు తెచ్చిపెట్టేవాళ్ళు, ఒక్కోసారి, మా అమ్మ, మిట్టు వెళ్ళేవారు. ఈ లైబ్రరీ లేకపోతె ఇంకా ఎంత పిచ్చెక్కి పోయేదో అనిపిస్తుంది ఒక్కోసారి.
ఆ రోజలు తలచుకుంటే వణుకు కూడా వచ్చేస్తుంది, కూర్చోలేను, నుంచోలేను, నడవాలంటే పడిపోతానేమో అని భయం, తిండి సహించదు, ఏమి అర్థం కాదు, కుదురులేని ఆలోచనలు, క్షణ క్షణం భయం భయం... కాని ఒక భయంకరమైన మొండి ధైర్యం తెగువ, అదే లేకపోతె నేనంటూ లేనేమో.